Thursday 21 April, 2011

రాజశేఖరిస్టు ఏబీకే పెడబొబ్బలు

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడంలో ఎంతగా ఆరితేరిపోయావు ఎబీకే! ‘తెలంగాణకోసం పైరవీ’ చేశామని స్వయంగా రావి నారాయణరెడ్డి తన ఆత్మకథలో రాసుకున్నారు. రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు నెహ్రూ వద్దకు వెళ్లి విశాలాంధ్ర సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని కోరితే, ఆయన ‘మానవ సంబంధ వ్యవహారాల్లో శాశ్వతత్వం అంటూ ఉండదు’ అని సమాధానం చెప్పారు. మౌలానా ఆజాద్ తమను ఈసడించుకున్నాడని కూడా రాశారు. అయినా ఒకనాటి మార్క్సిస్టు అలియాస్ మావోయిస్టు అలియాస్ వైఎస్ రాజశేఖరిస్టు ఎబికె ప్రసాద్ విపరీత సైద్ధాంతిక పైత్య ప్రకోపాలను మాత్రం మానుకోలేదు. ఎప్పటిలాగే అసత్యాలు, అర్ధ సత్యాలు, వక్రీకరణలు పోతపోసి ప్రజలపై కుమ్మరిస్తున్నాడు. నెహ్రూకు ఉన్న జ్ఞానం కూడా ఇంకా గతంలోనే, గతంకోసం, గతమే కీర్తిస్తున్న కుహానా మార్క్సిస్టు ఎబీకేకు లేకపోయింది. ‘విస్తరణ కాంక్షను’ నెహ్రూ గుర్తించారు, కానీ కోస్తా కమ్యూనిస్టు నాయకుల ఆధిపత్యంలోని తెలంగాణ కమ్యూనిస్టులు గుర్తించలేకపోయారు. కోస్తా కమ్యూనిస్టు నాయకులు అనాలోచితంగా సాయుధపోరాటాన్ని కొనసాగించి మూడు వేల మంది తెలంగాణ ముద్దు బిడ్డలను బలిపెట్టి, ఇక లాభంలేదని నిర్ధారణకు వచ్చి ఎన్నికలకు వచ్చే సరికి, ‘విశాలాంధ్రలో ప్రజారాజ్య’మనే ఒక కలను సృష్టించి, ఆ కలే నిజమవుతుందని నమ్మించి, అదే తెలంగాణాకు మంచిదని భ్రమింపజేసి, తెలంగాణ పార్టీని బుట్టలో వేశారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం వస్తుందన్న భ్రమల్లోనే 1969లో కూడ తెలంగాణ కమ్యూనిస్టులు ఉన్నారు. ఆ మైకంలోనే రావి నారాయణరెడ్డి నాది వీర తెలంగాణ వేరు తెలంగాణ కాదని ప్రకటించారు. కానీ ప్రజారాజ్యం రాలేదు. కోస్తా ఆధిపత్య రాజ్యం వచ్చింది. ప్రభుత్వాల్లోనే కాదు, కమ్యూనిస్టు పార్టీల్లో కూడా. పార్టీ అంతా తెలంగాణాలో ఉంటుంది. పెత్తనం మాత్రం అక్కడి వారిది. విశాలాంధ్ర ఒక వల అని, దూరదృష్టితో పన్నిన ఒక కుట్ర అని ఆరోజు రావి నారాయణరెడ్డిగానీ, మఖ్దుం మొహియుద్దీన్‌గానీ గుర్తించలేకపోయారు. ఆ తర్వాత గుర్తించి మాట్లాడేందుకు ఇప్పుడు వారు లేరు. తాను స్వయంగా వితండవాదాలు, కుతర్కాలకు పాల్పడుతూ తెలంగాణ మేధావులను దూషిస్తున్న ఏబీకే రాజ్యాంగంలోని మూడవ అధికరణంపై చేసిన వాదన చూస్తే ఈ మనిషినేనా మహా జర్నలిస్టుగా తెలంగాణ ప్రజలు ఇంతకాలం మోసింది అని సిగ్గనిపిస్తోంది. ఇరవై కోట్ల జనాభాతో పాలించ సాధ్యంకాని దుర్గమ రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌ను ఈ దేశం ఇంకా ఎంతకాలం భరించగలదు ఆర్టికల్ 3 లేకపోతే. అంబేద్కర్ మెజారిటీల దాష్టీకానికి మైనారిటీలు బలికాకూడదనే రాష్ట్రాల శాసనసభలకు విభజనకు సంబంధించి ఎటువంటి అధికారం కట్టబెట్టలేదు. పార్లమెంటులో కూడా సాధారణ మెజారిటీ చాలని చెప్పారు. ఆయన వాదన అంత స్పష్టంగా, రాజ్యాంగ లిఖితంగా కనిపిస్తుంటే మనవాడు కోడిగుడ్డుపై ఈకలు పీకే పని చేశాడు. ఇవ్వాళ తెలంగాణలో సిపిఐ రావి నారాయణ రెడ్డి వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతోంది. తమ కళ్లముందు ఒక మహత్వాకాంక్ష వెల్లువెత్తుతుంటే కళ్లు మూసుకుని కూర్చోవడానికి నిరాకరించి, కోస్తా కమ్యూనిస్టుల మెజారిటీ మైనారిటీ పాచికలను అధిగమించి జై తె లంగాణ నినాదాన్ని ఎత్తుకుంది ఆ పార్టీ. సాయుధ పోరాట విరమణకు పిలుపునిద్దామని అన్నందుకు రావి నారాయణ రెడ్డిని ఘోరంగా అవమానించిన దాష్టీకం కోస్తా కమ్యూనిస్టు నాయకత్వానిది. రావి నారాయణ రెడ్డి ఇంటిని తగులబెట్టించిన పాశవికత కోస్తా నాయకత్వానిది. రావి నారాయణరెడ్డిని అవమానించిన అనే క మంది కోస్తా కమ్యూనిస్టుల్లో పుచ్చలపల్లి, మోటూరు, మాకినేని బసవపున్నయ్య వంటి వారితోపాటు అన్నే భవానీ కృష్ణ ప్రసాద్(ఎబీకే) కూడా ఉన్నాడు. ఆయనను రివిజనిస్టుగా పార్టీలో తొక్కిపారేశారు. ఆయననే కాదు తెలంగాణలో సాయుధపోరాటానికి నాయకత్వం వహించిన ఏ ఒక్కరూ పార్టీల్లో ఉన్నతస్థానాల్లోకి రాలేకపోయారు. గిరిప్రసాద్ మాత్రమే ఇందుకు మినహాయింపు. సిపిఎంలో ఇంకా దారుణం. కానీ ఇప్పుడు పాదాలకింద భూమి కదులుతోంది కదా. తెలంగాణ ఉప్పెన మీదకు వస్తోంది కదా. అన్ని సిద్ధాంత స్రవంతులూ ఏకమై ఒకే నినాదాన్ని వినిపిస్తున్నాయి కదా. పాపం! ఎబీకే గంగవెర్రులెత్తుతున్నారు. అందుకే ఇప్పుడు రావి నారాయణ రెడ్డి ఆయనకు ఆరాధ్య దైవంగా కనిపిస్తున్నాడు. మా వేలితో మా కన్ను పొడిపించాలని ఎబీకే ఆరాటం. రావి నారాయణరెడ్డి మీ కుట్రలను, మీ దూరదష్టిని గుర్తించలేకపోయిన అమాయకుడు. మీ బహురూపుల వేషాలు, మీ అవకాశవాద తర్కాలు, మీ ఎత్తులు జిత్తులు ఈ యాభైయ్యేళ్లలో మాకు అర్థమయినయి. మీరు ఇంకా మమ్మల్ని మోసం చేయలేరు. ఎబీకే మీ నిజస్వరూపం తెలిసిపోయింది. మీరందరూ ఒకే గొంతుతో ఎందుకు మాట్లాడుతున్నారో తేలిపోయింది. మీరు ఎంత గింజుకున్నా తెలంగాణను ఆపలేరు.
- కట్టా శేఖర్ రెడ్డి