Saturday 27 August, 2011

యుగసంధి


విప్లవం రాలేదు
చివరకు తెలంగాణ కూడా రాలేదు
జీవితమంతా పోరాటమే
మెదడునిండా నిరంతర ఆరాటమే
నిద్రకనులు చెమ్మగిలుతున్నయ్
ఓటమి భయపెడుతున్నది
నిరాశ కృంగదీస్తున్నది
స్తబ్దత పరివ్యాప్తమవుతున్నది
మౌనం రాజ్యమేలుతున్నది
తేలుకుట్టిన దొంగలు దర్బారు కలుగుల్లో దూరిపోయారు
ఆశల ముహూర్తాలు అనంతంగా మారిపోతుంటాయి
శత్రువు విలనీ వెక్కిరిస్తున్నది
కలిసొచ్చే కాలంకోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూపులు
ఎండమావి ఎప్పటికీ చేరువ కాదు
ఈ పరుగు ఎన్నాళ్లు?
ఈ నిరీక్షణ ఎన్నేళ్లు?
గుండెలు పగిలిపోతున్నయ్
ఉరితాళ్లు పేనుకుంటున్నయ్
ఎండోసల్ఫాన్ డబ్బాలు నేలంతా పరుచుకుంటున్నయ్
మనుషులు నిలువునా కాలిపోతున్నారు
అయినా
నేను ఎదురు చూస్తాను
తప్పకుండా ఎదురు చూస్తాను
ఓటమి భయపడే రోజుకోసం
స్తబ్దత భళ్లున బద్దలయ్యే తరుణంకోసం
నిరాశల సమాధులపై ఆశల జెండా ఎగురవేసే క్షణంకోసం
మౌనం ప్రళయకాల గర్జనగా మారే ముహూర్తంకోసం
శాంతి అశాంతిల మధ్య సరిహద్దులు ధ్వంసమయ్యే రోజుకోసం
కాలం అఖండమై స్తంభించిపోయే సమయం కోసం
స్వేచ్ఛా పవనాలకోసం
మృత్యువును జయించలేకపోతే
శత్రువునూ జయించలేం!
జీతే రహేంగే లడ్తే రహేంగే!
-శరశ్చంద్ర